రాగులతో ఈ రెసిపీలు చేస్తే కుటుంబం అంతా ఆరోగ్యమే.

రాగులతో ఈ రెసిపీలు చేస్తే కుటుంబం అంతా ఆరోగ్యమే.

రాగులతో ఈ రెసిపీలు చేస్తే కుటుంబం అంతా ఆరోగ్యమే.

 

చిరుధాన్యాలలో ఒకటి అయిన రాగుల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. రాగులను మన ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఎన్నో రకాల రోగాలను మన దరిదాపుల్లోకి రాకుండా మనం మన శరీరాన్ని కాపాడుకోవచ్చు. పూర్వకాలంలో 90 శాతం మంది రాగులనే తమ ఆహారంగా తీసుకునేవారు. ఎవరో కొందరు ధనవంతులు మాత్రమే బియ్యాన్ని అలాగే గోధుమలను తినేవారు.

రాగుల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రాగి పిండితో వంటలను తయారు చేసుకొని తినడం ద్వారా మన బరువుని అదుపులో ఉంచుకోవచ్చు. బరువు తగ్గాలి అని అనుకున్న వారు తప్పకుండా రాగి పిండిని ఆహారంలో భాగం చేసుకోవాలి. రాగులలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. అలాగే ప్రోటీన్ కూడా ఉంటుంది. చిన్న వయసు నుండి రాగులను అధికంగా తీసుకున్న వారికి వయసు పైబడినా సరే ఎముకలు బలంగా ఉంటాయి. అలాగే మోకాళ్ళ నొప్పులు కూడా రాకుండా ఉంటాయి.

చక్కెర వ్యాధిని అదుపులో పెట్టుకోవాలి అని అనుకున్నా సరే తప్పకుండా రాగులు ( Finger Millets) తీసుకోవాలి. రాగులను తినడం ద్వారా చర్మం ఆరోగ్యవంతంగా తయారవుతుంది అలాగే వెంట్రుకలు కూడా చాలా బలంగా తయారవుతాయి.

బాలింతల ఆహారంలో రాగి పిండిని చేర్చడం ద్వారా వారిలో పాల ఉత్పత్తి బాగా పెరుగుతుంది. రాగుల ద్వారా అనీమియా లాంటి వ్యాధి కూడా తగ్గించుకోవచ్చు. ప్రతిరోజు రాగి పిండిని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా శరీరంలో ఎర్ర రక్త కణాలను ఉత్పత్తిని పెంచుకోవచ్చు.

ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న రాగులను తినడం కాస్త కష్టంగా ఉంటుంది. అలవాటు ఉన్నవారైతే సులభంగా తినవచ్చు కానీ అలవాటు లేని వారు ఈ రాగులను తినాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సాధారణంగా ఎవరైనా రాగి పిండితో ఏం చేస్తారు? రాగి ముద్దని తయారు చేసుకొని తింటూ ఉంటారు. కొందరికి ఈ రాగి ముద్ద నచ్చకపోవచ్చు. కానీ రాగులను ఎలాగోలా ఆహారంలో భాగం చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. రాగి పిండి అంటే కేవలం రాగి ముద్ద మాత్రమే కాదు రాగులతో రకరకాల ఆహార పదార్థాలు ( Finger Millet Recipes) చేసుకోవచ్చు.

1. రాగి రొట్టె

    రాగి పిండితో రుచికరమైన రొట్టెలను తయారు చేసుకోవచ్చు. ఒక కప్పు రాగి పిండికి అర కప్పు గోధుమపిండి కలుపుకోవాలి. ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, తురుముకున్న క్యారెట్, వేయించి పొడి చేసిన పల్లీలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ లు…ఉప్పు జీలకర్ర వేసి నీటితో అన్నిటిని ఒక ముద్దులా కలుపుకోవాలి.

ఇప్పుడు ఒక అరటి ఆకు పై లేదా తడి గుడ్డ పై కలిపి పెట్టుకున్న పిండిని నీ కాస్త రొట్టె లా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఒత్తుకున్న ఆ రొట్టెని పెనంపై వేసి రెండు వైపులా నూనె రాసి బాగా కాల్చుకోవాలి. ఒక్కో రొట్టెని దాదాపు నాలుగు నిమిషాలు కాల్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రాగి పిండి ఉడకడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి. అలా కాల్చుకున్న తర్వాత వాటిని పల్లి చట్నీ లేదా మరి ఏదైనా పచ్చడితో హాయిగా తినవచ్చు.

 2. రాగి దోశ 

   సాధారణంగా మనం ఎప్పుడూ బియ్యం నానబెట్టి రుబ్బుకున్న దోసలను మాత్రమే తింటూ ఉంటాం. అవి చేయడం కూడా చాలా సులభంగా ఉంటుంది. రాగి దోశలు కూడా ఇంకా సులభంగా చేసుకోవచ్చు. అది కూడా ఇన్స్టంట్ గా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు రాగి పిండిలో అరకప్పు గోధుమపిండి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు సోడా ఉప్పు వేయాలి. ఆపై నీటిని కలిపి దోస బ్యాటర్ తయారు చేసుకోవాలి. అంతే రాగి దోస పిండి తయారైనట్టే. ఇప్పుడు మనం మామూలు దోశలను ఎలా వేసుకుంటామో అలా అని మనం తయారు చేసుకున్న బ్యాటర్ తో రాగి దోశలను వేసుకుంటాం. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే మామూలు దోశలకంటి ఇవి కాస్త ఎక్కువసేపు కాలాల్సి ఉంటుంది. ఈ దోశలను చేస్తూ ఉన్నప్పుడు మంట కాస్త తక్కువగా ఉండాలి అలాగే దోసపై మూత పెట్టి కాల్చుకోవాల్సి ఉంటుంది.

3. రాగి లడ్డు

     ఈ లడ్డులను క్యాల్షియం లడ్డు అని కూడా అనొచ్చు. కాల్షియం లోపం లేదా అనీమియా ఉన్నవారు ఈ లడ్డులను రోజుకొకటి తీసుకుంటే చాలా మంచిది. ముందుగా మూకుడులో రాగి పిండిని వేసి దోరగా వేయించుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే రాగి పిండి వేగిన సువాసన వస్తుందో అప్పుడు అందులోకి కొంత నెయ్యిని వేయాలి. అలా కొద్దికొద్దిగా నెయ్యిని వేసుకుంటూ రాగి పిండిని బాగా వేయించుకోవాలి. రాగి పిండి రంగు మారనివ్వాలి, ఇప్పుడు ఆ పిండిని చల్లారనివ్వాలి. ఇప్పుడు నానబెట్టిన ఖర్జూరాలని మన వద్ద ఉన్న డ్రై ఫ్రూట్స్ ని మిక్సీ పట్టుకొని ముద్దలా తయారు చేయాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ ముద్దని వేయించిన రాగి పిండిలోకి వేసి కొద్ది కొద్దిగా పాలు వేస్తూ లడ్డుల్లా చుట్టుకోవాలి. ఇందులోకి మనం ఎలాంటి చెక్కరిని వాడలేదు. నేచురల్ స్వీట్నర్ అయిన ఖర్జూరాలని వాడాము. కాబట్టి ఇవి షుగర్ పేషెంట్స్ కూడా హాయిగా తీసుకోవచ్చు. బరువు తగ్గాలనుకున్నవారు సాధారణంగా స్వీట్స్ కి దూరంగా ఉంటారు. కానీ ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇలాంటి లడ్డూలని ఎలాంటి గిల్ట్ లేకుండా తీసుకోవచ్చు. 

 

4. రాగి ఇడ్లీ

సాధారణంగా ఈ రాగి ఇడ్లీని ఈమధ్య చాలామంది తమ ఇళ్లల్లో ట్రై చేస్తూ ఉంటారు. మనం ఎప్పుడూ చేసుకునే ఇడ్లీ పిండిలోకి కొంత రాగి పిండిని కలిపి రాగి ఇడ్లిని చేస్తూ ఉంటారు. ఇది కూడా ఎంతో కొంత మంచిదే కానీ రాగుల యొక్క పూర్తి పోషకాలు మనకు అందాలు అంటే రాగి  ఇడ్లిని ఇలా తయారు చేసుకోండి.

రెండు కప్పుల రాగులకు ఒక కప్పు మినప గుళ్ళు అర కప్పు బియ్యం రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల మెంతులు వేసి బాగా కడిగి శుభ్రం చేసి నానబెట్టుకోండి. ఎనిమిది గంటలు వీటన్నిటిని బాగా నానబెట్టుకోండి. ఇక రాత్రి వీటన్నిటిని ఇడ్లీ పిండిలా రుబ్బి పెట్టుకోవాలి. మరుసటి రోజు మనం సాధారణ ఇడ్లీలను తయారు చేసినట్టే ఈ పిండితో కూడా ఇడ్లీలను తయారు చేసుకోవచ్చు. ఇందులో మన మెయిన్ ఇంగ్రిడియంట్ రాగులే కాబట్టి రాగుల్లో ఉన్న పోషకాలన్నీ మనకు బాగా అందుతాయి.

ఎవరైతే రాగి ముద్ద తినడానికి ఇష్టపడరు అలాంటివారు పైన చెప్పిన రెసిపీస్ ని చేసుకోవచ్చు. అలానే రాగుల నుండి పొందాల్సిన అన్ని పోషకాలని రుచికరంగా పొందవచ్చు.

 


© 2023 - 2024 Millets News. All rights reserved.