భారతదేశంలో చిరుధాన్యాలను ప్రస్తుతం విరివిగా వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మిల్లెట్స్ ను దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో పండిస్తున్నారు. పురాతన ధాన్యాలైన మిల్లెట్స్ పై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వీటిని తమ రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకున్నారు.
అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం -2023 సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రశంసాపత్రాన్ని సాధించింది. పోషకాహారం, ఆరోగ్యం మరియు ఆర్థిక అభివృద్ధితో సహా చిరుధాన్యాల ప్రయోజనాలపై అవగాహన కల్పించడానికి ఈ ఏడాది కేటాయించబడింది. ఈ క్రమంలోనే ఈ శాఖను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సత్కరించింది. దీనిపై ముఖ్యమంత్రి ఠాకూర్ సుఖ్వీందర్ సింగ్ సుఖు హర్షం వ్యక్తం చేశారు. చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడంలో చేసిన అసాధారణ కృషిని అభినందించారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి ప్రొఫెసర్ చందర్ కుమార్ కూడా చిరుధాన్యాలను సాగు చేసిన రైతులను ప్రశంసించారు.
పోషకాహార లోపం, జనాభా పెరుగుదల, పరిమిత సహజ వనరులు మరియు ఆకలి వంటి ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు చిరుధాన్యాలు చక్కని పరిష్కారంగా నిలుస్తున్నాయి. తక్కువ ఖర్చుతో సాగయ్యే ఈ ధాన్యాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ క్రమంలోనే మిల్లెట్స్ ప్రాముఖ్యతను వివరించడానికి, వీటిపై అవగాహన కల్పించడానికి మరియు చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడానికి వ్యవసాయ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యకలాపాలను నిర్వహించింది. చిరుధాన్యాల సాగును విస్తరించడంలో రైతులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించడమే లక్ష్యంగా పని చేసింది.
అదేవిధంగా తదుపరి కార్యక్రమాలలో భాగంగా విత్తనాలు, మినీ కిట్ల పంపిణీ, రైతులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు చిరుధాన్యాల అమ్మకాల నిర్వహణ మరియు చిరుధాన్యాల (మిల్లెట్స్) ఆహార ఉత్పత్తుల ప్రదర్శనలను నిర్వహించడం వంటివి ఉన్నాయి. మిల్లెట్స్ సాగు మరియు వంటకాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించారు. దీంతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ చిరుధాన్యాల సాగు విస్తరించింది. దీంతో సుమారు 1,526 హెక్టార్ల విస్తీర్ణంలో 983 మెట్రిక్ టన్నుల దిగుబడి కూడా వచ్చిందని ప్రతినిధి తెలిపారు.
© 2023 - 2024 Millets News. All rights reserved.