టీ 20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన టీమ్ ఇండియాకు భారత క్రికెట్ అభిమానుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి చేరుకున్న భారత క్రికెట్ జట్టు నేరుగా చాణక్యపురిలోని ఐటీసీ మౌర్య హోటల్ కు చేరుకున్నారు. అక్కడ వారికి హోటల్ సిబ్బంది చోలే భతూరే, మిల్లెట్స్ తో కూడిన అల్పాహారంతో పాటు ప్రత్యేకంగా రూపొందించిన ట్రోఫీ కేక్ తో ఘనంగా స్వాగతించారు.
చోలే భతూరే ఉత్తర భారతదేశానికి చెందిన ప్రియమైన వంటకమన్న సంగతి తెలిసిందే. అయితే టీ 20 ప్రపంచ కప్ విజేత టీమిండియా ఆటగాళ్లకు హోటల్ సిబ్బంది ప్రత్యేక అల్పాహారాన్ని సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ముంబైకర్ రోహిత్ ఎంతగానో ఇష్టపడే వడా పావ్, విరాట్ కోహ్లీకి నచ్చే అమృత్ సర్ స్టయల్ చోలే భతూరేని అల్పాహారంగా అందించారు. అదేవిధంగా ఇతర ఆటగాళ్లకు గదులను అందంగా అలంకరించంతో పాటు చాక్లెట్ తో చేసిన బాల్స్, బ్యాట్, పిచ్ ను ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా ఛాంపియన్స్ గౌరవార్థం ప్రత్యేక కేక్ ను కూడా హోటల్ సిబ్బంది తయారు చేశారు. ఈ కేక్ జట్టు జెర్సీ రంగులో ఉండగా.. పైన చాక్లెట్ తో రూపొందించిన టీ 20 వరల్డ్ కప్ ట్రోఫీ ప్రతిరూపం ఉండటం ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవచ్చు.
అసలైన ట్రోఫీని తలపించే విధంగా ఈ ట్రోఫీని చాక్లెట్ తో తయారు చేసినట్లు ఐటీసీ మౌర్య చెఫ్ తెలిపారు. విజేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టుకు ఇది తమ తరపున స్వాగతమని చెప్పారు. అదేవిధంగా ప్రత్యేక వేదికలో ఆటగాళ్లకు మిల్లెట్స్ తో తయారు చేసిన వివిధ రకాల ఆహార పదార్థాలతో పాటు భారతీయ వంటకాలు సిద్దం చేసినట్లు తెలిపారు. ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని అందించే విధంగా అల్పాహారాన్ని అందించామని వెల్లడించారు.
© 2023 - 2024 Millets News. All rights reserved.