భారతదేశంలో చిరుధాన్యాలు (మిల్లెట్స్) పై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వీటిని ఆహారంగా తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో చిరుధాన్యాలను విరివిగా సాగు చేస్తుండగా.. మిల్లెట్ ప్రాసెసర్ల మద్ధతు పెంపు కోసం హర్యానా ప్రభుత్వం వడ్డీ రాయితీ పథకాన్ని ప్రారంభించింది. ఈ యూనిట్లకు ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా మిల్లెట్ మార్కెట్ ను బలోపేతం చేయడంతో పాటు మినుము రైతులకు జీవనోపాధిని మెరుగుపరచడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం.
మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా తీసుకునే టర్మ్ లోనులపై వడ్డీ రాయితీని అందిస్తామని పథకం యొక్క ప్రాథమిక లక్ష్యమని అధికారిక ప్రతినిధి వివరించారు. ఈ యూనిట్లు సంవత్సరానికి 7 శాతం వడ్డీ రాయితీ లేదా చెల్లించిన వాస్తవ వడ్డీ రేటును ( ఏదీ తక్కువైతే అది) పొందడానికి అర్హులు. ఈ పథకం కింద మిల్లెట్ ప్రాసెసింగ్ కోసం ఎంఎస్ఎంఈలు పొందే టర్మ్ లోనులకు ఆర్థిక సంవత్సరానికి రూ.25 లక్షలు అందిస్తామని వెల్లడించారు.
అలాగే, హర్యానా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి చట్టం 2006 ద్వారా చేపట్టిన అనేక రకాల ఎంటర్ ప్రైజ్ లను కలిగి ఉంటుంది. సూక్ష్మ సంస్థల కోసం ప్లాంట్ మరియు యంత్రాలు లేదా పరికరాలలో పెట్టుబడి రూ. కోటి మించకూడదని, అదేవిధంగా టర్నోవర్ రూ. 5 కోట్లకు మించకూడదు. చిన్న పరిశ్రమల కోసం పెట్టుబడి రూ. 10 కోట్లు మించకూడదు. టర్నోవర్ క్యాప్ తో రూ.50 కోట్లు ఉండాలి.
హర్యానాలో ప్రాథమిక, ద్వితీయ మిల్లెట్ ప్రాసెసింగ్ కార్యకలాపాలలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) ఆర్బీఐ నియంత్రిత ఆర్థిక సంస్థలు అయిన కో -ఆపరేటివ్ బ్యాంకులు, హర్యానా స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్, NABARD, SIDBI, EXIM తో పాటు వాణిజ్య బ్యాంకుల నుండి టర్మ్ రుణాలు పొందుతాయి. అదేవిధంగా వడ్డీ రాయితీ కోసం దరఖాస్తులను డిపార్ట్ మెంట్ వెబ్ పోర్టల్ ద్వారా డైరెక్టర్ జనరల్, ఎంఎస్ఎంఈకి, ఆర్థిక సంవత్సరం ముగిసిన మూడు నెలల్లోపు లేదా పథకం జారీ చేసిన నోటిఫికేషన్ తేదీ తరువాత సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తు సమర్పించిన తేదీ నుండి సుమారు 40 పని దినాలలో అర్హత గల అప్లికేషన్స్ మంజూరు లేఖను అందుకుంటాయని ప్రతినిధి తెలిపారు. తరువాత మంజూరు చేసిన లేఖ దాదాపు పది పని దినాలలో జారీ చేయబడుతుంది. మంజూరు లేఖ జారీ చేసిన తరువాత ఆర్థిక సహయం అందించే ప్రక్రియ 14 రోజులలో పూర్తవుతుంది. కాగా హర్యానా సర్కార్ తీసుకొచ్చిన ఈ పథకం రాష్ట్రంలోని మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఆర్థిక భారాన్ని తగ్గించడం మరియు మిల్లెట్ ప్రాసెసింగ్ కార్యకలాపాలలో పెట్టుబడిని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు.
© 2023 - 2024 Millets News. All rights reserved.