భారతదేశంలో చిరుధాన్యాలు (మిల్లెట్స్) వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. ఒక్క మనదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచ వ్యాప్తంగా పురాతన ధాన్యాలైన మిల్లెట్స్ పై అవగాహన పెరుగుతోంది. దీంతో ప్రజలు రోజువారీ ఆహారంలో మిల్లెట్స్ ను భాగంగా చేసుకుంటున్నారన్న సంగతి తెలిసిందే.
దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు మిల్లెట్స్ ను వినియోగిస్తున్నాయి. తాజాగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మిల్లెట్స్ తో పాటు వాటి ఆధారిత ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా మిల్లెట్ కేఫ్ లను ఏర్పాటు చేయనుందని వ్యవసాయ శాఖ మంత్రి పి. ప్రసాద్ తెలిపారు. దాంతోపాటుగా సేంద్రీయ ఆహార పదార్థాలు ( పండ్లు మరియు కూరగాయాలు) అందించేందుకు గానూ ‘కేరళాగ్రో’ పేరిట స్టోర్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు..
రాష్ట్రంలోని తిరువనంతపురం, ఇడుక్కి, త్రిస్సూర్, ఎర్నాకులంలో ‘కేరళాగ్రో’ స్టోర్స్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. మిగిలిన జిల్లాల్లోనూ ప్రతిపాదించిన స్టోర్స్ ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని మంత్రి పి.ప్రసాద్ తెలిపారు. సేంద్రీయ మరియు మంచి వ్యవసాయ పద్ధతుల ద్వారా పండించిన కూరగాయలు, పండ్లు కేరళాగ్రో స్టోర్స్ లో అందుబాటులో ఉంటాయన్నారు. ఇక మిల్లెట్స్ మరియు మిల్లెట్ ఆధారిత ఉత్పత్తులను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ప్రత్యేకంగా రూపొందించిన ‘మిల్లెట్ కేఫ్’ లను వినియోగించనున్నట్లు తెలిపారు. ముందుగా తిరువనంతపురం, ఎర్నాకులం, త్రిస్సూర్ లలో మిల్లెట్ కేఫ్ లు అందుబాటులో ఉండనుండగా.. ఈ ఆగస్ట్ నెల నాటికి మిగిలిన జిల్లాల్లోనూ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
మినుములకు ప్రాచుర్యాన్ని కల్పించడంలో కృషికూటం రైతు సంఘాలు, కుటుంబ శ్రీ గ్రూపులు మరియు రైతు ఉత్పత్తి సంస్థలు ( ఎఫ్.పీ.ఓ) కీలకంగా పని చేస్తాయి. అదేవిధంగా మిల్లెట్ కేఫ్ ల కార్యకలాపాలను ఈ సంస్థలతో కలిసి వ్యవసాయ సేవా కేంద్రాలు నిర్వహిస్తాయని తెలుస్తోంది.
అయితే.. మిల్లెట్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చిరుధాన్యాలలో ప్రోటీన్, విటమిన్లు, ఫైబర్ తో పాటు కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. వీటిని పోషకాహార నిపుణుల సూచలన మేరకు తగిన మోతాదులో తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. చిన్నారుల నుంచి పెద్దవారి వరకు మిల్లెట్స్ తయారు చేసిన ఆహార పదార్థాలను తినడం వలన అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం తగ్గుతుందని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి మిల్లెట్స్ ను ఆహారంలో భాగంగా చేసుకోవాలని సూచిస్తున్నారు.
© 2023 - 2024 Millets News. All rights reserved.