చిరుధాన్యాలు ( మిల్లెట్స్ ) పై ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మిల్లెట్స్ పంటలను విరివిగా సాగు చేస్తున్నారు. అయితే మిడ్ వెస్ట్ ( మధ్య పశ్చిమ) ప్రాంతంలో మాత్రం వరి, మొక్కజొన్న మరియు సోయాబీన్లకు ప్రసిద్ధి చెందింది. కానీ మధ్య మిస్సౌరీలో చిరుధాన్యాల సాగు కనిపిస్తోంది. దీనికి కారణం మిల్లెట్స్ సాగు కోసం తక్కువ పెట్టుబడి సరిపోతుందని అక్కడి రైతులు చెబుతున్నట్లు తెలుస్తోంది. మొక్కజొన్న, సోయాబీన్ పంటలతో పోలిస్తే.. మిల్లెట్స్ కోసం చాలా తక్కువ ఖర్చు అవుతుంది. అదేవిధంగా పంట కూడా తక్కువ సమయంలోనే చేతికి వస్తుందని రైతులు చెబుతున్నారు.
అయితే, 2023 ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార వ్యవస్థలో మిల్లెట్స్ కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంది. ఆ తరువాత మిల్లెట్స్ పై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు చిరుధాన్యాల కోసం మార్కెట్ లను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. మిల్లెట్స్ స్థితిస్థాపక పంటే కాదు వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మిల్లెట్స్ ను ప్రతి రోజూ ఆహారంలో తీసుకునే వారు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు.
పురాతన ధాన్యంగా ఉన్న మిల్లెట్స్ కొన్ని సంవత్సరాలుగా మరుగున పడిపోయాయి. దీంతో దశాబ్దాలుగా గోధుమ, బియ్యం మరియు మొక్కజోన్న వంటి పంటలు ప్రధాన పంటలుగా మారాయని ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ లో వ్యవసాయ అధికారి అన్నారు. ఈ క్రమంలోనే చిరుధాన్యాలను నిర్లక్ష్యం చేయబడిన పంటలలో ఒకటిగా పరిగణిస్తామని తెలిపారు. అయితే ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు చిరుధాన్యాలకు అవకాశం ఉందని స్పష్టం చేశారు.
వాతావరణ అనుకూల పంట:
చిరుధాన్యాలలో అనేక రకాలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా జపనీస్ మిల్లెట్స్ తో పాటు రాగులు, కొర్రలు, ఊదలు, జొన్నలు వంటి ధాన్యాలున్నాయి. అంతేకాదు చిరుధాన్యాలను సాగు చేసేందుకు తక్కువ ఎరువులు అవసరం అవుతాయి. ఈ పంటలకు తెగుళ్ల బెడద కూడా తక్కువగా ఉంటుంది. మిల్లెట్స్ ఎక్కువ దిగుబడిని ఇవ్వకపోయినప్పటికీ తక్కువ ఖర్చుతో సాగు చేయవచ్చు. అందుకే మధ్య పశ్చిమతో పాటు గ్రేట్ ప్లెయిన్స్ లోని కొన్ని ప్రాంతాల్లో మిల్లెట్స్ ముఖ్యమైనవి.
జపనీస్ మిల్లెట్ వేడి తేమతో కూడిన వాతావరణ పరిస్థితులను సైతం తట్టుకోగలదు. అలాగే నీటి సరఫరా సౌకర్యం తక్కువగా ఉన్న చోట్ల కూడా చిరుధాన్యాల పంటలను పండించవచ్చు. మిస్సౌరీ, మిస్సిస్సిపి నది దిగువ ప్రాంతాలు మరియు వరదలకు గురయ్యే ప్రదేశాలలో చిరుధాన్యాలను సాగు చేస్తారు. ఆహార పంటగా ఉన్న మిల్లెట్స్ ను పశువులకు మేతగానూ ఉపయోగిస్తారు.
ప్రస్తుత కాలంలో ప్రజలు గ్లూటెన్ ఫ్రీ ఆహారాన్ని తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అటువంటి వారి కోసం మిల్లెట్స్ మంచి ఆహార ఎంపికని చెప్పుకోవచ్చు. యునైటెడ్ స్టేట్స్ లో చిరుధాన్యాల మార్కెట్ అంత పెద్దది కాదు. దీంతో అక్కడ మిల్లెట్స్ ఇతర పంటల తరహాలో ప్రసిద్ధి చెందలేదు. ఈ సందర్భంగానే చిరుధాన్యాల అభివృద్ధి కోసం మరింత పరిశోధన అవసరముందంటున్న నిపుణులు మిల్లెట్స్ సాగు చేసే రైతులకు ప్రోత్సహకాలు ఉంటే మరింత మంచి ఫలితాలను పొందవచ్చని భావిస్తున్నారు.
© 2023 - 2024 Millets News. All rights reserved.