చిరుధాన్యాలు యావత్ ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ ప్రాచుర్యంలోకి వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు మిల్లెట్ పిండి గ్లోబల్ మార్కెట్ లో బలమైన వృద్ధిని సైతం సాధించింది. 2023 వ సంవత్సరంలో 5.37 బిలియన్ డాలర్ల నుండి 2024లో 5.83 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ క్రమంలోనే వార్షిక వృద్ధి రేటు ( సీఏజీఆర్) 8.6 శాతం పెరిగింది. మిల్లెట్ గ్లూటెన్ ఫ్రీ కావడంతో పాటు వీటి వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన పెరగడం మరియు కొన్ని దేశాల్లో చిరుధాన్యాల సాగుకు ప్రభుత్వ మద్ధతు మరియు రాయితీలు కల్పించడం, ఇతర ధాన్యాలతో పోలిస్తే.. చిరుధాన్యాలకు డిమాండ్ పెరిగింది.
పెరిగిన వృద్ధి రేటు..
మిల్లెట్ పిండి మార్కెట్ లో బలమైన వృద్ధిని కొనసాగిస్తుంది. ఈ తరహాలో వృద్ధి రేటు పెరిగితే 2028 నాటికి 8.8 శాతంతో వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) వద్ద 8.15 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆరోగ్యంపై పెరుగుతున్న శ్రద్ధ, మిల్లెట్ ఉత్పత్తిలో కొత్త ఆవిష్కరణలు, తినడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే మిల్లెట్ స్నాక్స్ మరియు మిల్లెట్ తో తయారు చేసిన పానీయాలు అందుబాటులో ఉండటం వృద్ధి సాధించడానికి ఒక కారణమని చెబుతున్నారు. అదేవిధంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో పెరుగుతున్న మధ్యతరగతి జనాభా, స్థిరమైన వ్యవసాయం మరియు పర్యావరణ అనుకూల పద్ధతులపై నెలకొన్న ప్రాధాన్యత కూడా మిల్లెట్స్ వృద్ధి రేటు సాధించడానికి కారణమని నిపుణులు భావిస్తున్నారు.
ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ చిరుధాన్యాల పిండి మార్కెట్ వృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్తుందని భావిస్తున్నారు. మిల్లెట్స్ లో మన శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అదేవిదంగా పోషకాహార ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్, ఆరోగ్యం గురించి పెరుగుతున్న అవగాహన చిరుధాన్యాల ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది. మిల్లెట్స్ గ్లూటెన్ ఫ్రీ కావడంతో పాటు పోషకపదార్థాలు పుష్కలంగా ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు వీటిని తమ ఆహారంగా ఎంచుకుంటున్నారు.
మిల్లెట్ పిండిని చిరుధాన్యాల నుండి తయారు చేస్తారన్న సంగతి తెలిసిందే. ఇవి గ్లూటెన్ రహిత ధాన్యాలు. వీటిని సాధారణంగా గోధుమ పిండికి ప్రత్యామ్నాయంగా ప్రజలు వినియోగిస్తుంటారు. ముఖ్యంగా చిరుధాన్యాలు ప్రధాన ఆహారంగా ఉండే ప్రాంతాలలో మిల్లెట్ పిండి వాడకం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ పిండిలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లతో పాటు ఖనిజాలు వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
గ్లోబల్ మార్కెట్ లో మిల్లెట్ పిండిని అందించడంలో ప్రధాన కంపెనీలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఇందులో ఐటీసీ లిమిటెడ్, హైన్ సెలెస్టియల్ గ్రూప్, ఆర్డెంట్ మిల్స్ ఎల్ఎల్సీ, విటాకోస్ట్.కామ్, బాబ్స్ రెడ్ మిల్ నేచురల్ ఫుడ్స్ , కింగ్ ఆర్థర్ బేకింగ్ కంపెనీ, అజూర్ స్టాండర్డ్, రాజా ఫుడ్స్ కంపెనీలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు గ్లూటెన్ ఫ్రీ మరియు పోషకాహారాన్ని అందించడానికి మిల్లెట్ పిండిని అందిస్తున్నాయి. అయితే ప్రస్తుతం మార్కెట్ లో సేంద్రీయ మరియు సంప్రదాయ పద్ధతుల్లో పండించే జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, అండు కొర్రలు, వరిగెలు, ఊదలు, అరికలు పిండితో పాటు ఇతర రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక 2023లో మిల్లెట్ పిండి మార్కెట్ లో ఆసియా -పసిఫిక్ అతిపెద్ద ప్రాంతంగా ఉంది. ఈ మార్కెట్ నివేదికలో ఆసియా -పసిఫిక్ తో పాటు పశ్చిమ ఐరోపా, తూర్పు ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా ప్రాంతాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.
© 2023 - 2024 Millets News. All rights reserved.