చిరుధాన్యాలు (మిల్లెట్స్) పంపిణీలో రాజస్థాన్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపిస్తుంది. ఈ మేరకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా శీతాకాలంలో ప్రజలకు మిల్లెట్స్ ను అందించనుంది.
మిల్లెట్స్ కు కేంద్ర ప్రభుత్వం ‘శ్రీ అన్న’ గా పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీటికి ప్రాచుర్యం కల్పించే కార్యక్రమాల నిర్వహణలో భారతదేశం ముందంజలో ఉందన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ముతక ధాన్యాలపై దృష్టి సారించిన శ్రీ అన్నా పథకాన్ని మరింతగా ప్రోత్సహించడానికి రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ చొరవతో నవంబర్ నుంచి జనవరి వరకు ప్రజా పంపిణీ వ్యవస్థ ( పీడీఎస్) లో గోధుమలను చిరుధాన్యాలు (సజ్జలు)తో భర్తీ చేయాలని సర్కార్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ లో ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే లబ్ధిదారులకు మిల్లెట్స్ పంపిణీ చేయడానికి రైతుల నుంచి నేరుగా సుమారు పది లక్షల మెట్రిక్ టన్నుల చిరుధాన్యాలను సేకరించాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.
శీతాకాలంలో సుమారు 4.40 కోట్ల మంది లబ్దిదారులకు నెలకు ఐదు కిలోల బజ్రా (పెర్ల్ మిల్లెట్స్) లభిస్తుందని ఆహార మరియు పౌర సరఫరా మంత్రి సుమిత్ గోదారా తెలిపారు. రాష్ట్రంలో బజ్రా ప్రధాన పంటగా ఉందన్నారు. అదేవిధంగా చిరుధాన్యాలను సాగు చేసే రైతులకు ప్రభుత్వ మద్ధతు ధర లభించే విధంగా ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మతో చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలోని మొత్తం చిరుధాన్యాల ఉత్పత్తిలో రాజస్థాన్ రాష్ట్రం 40 శాతం వాటాను కలిగి ఉంది. దీంతో బజ్రా పంటకు అతి పెద్ద సాగుదారుగా నిలిచింది. అయితే ప్రభుత్వం అందించే మద్ధతు ధరలకు చిరుధాన్యాలను సేకరించడం అనేది రాష్ట్రంలో రాజకీయ సమస్యగా ఉంది.
పీడీఎస్ ( ప్రజా పంపిణీ వ్యవస్థ) ద్వారా చిరుధాన్యాల పంపిణీపై రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. మద్ధతు ధరలకు సంబంధించిన సేకరణ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా జైపూర్, జైసల్మేర్, బికనీర్, సికార్, గంగానర్, అల్వార్, జలోర్ వంటి ప్రధాన చిరుధాన్యాలు ఉత్పత్తి చేసే జిల్లాలు ఉన్నందున ఈ నిర్ణయం బీజేపీకి రాజకీయ ప్రయోజనం అందిస్తుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే రైతుల్లో నెలకొన్న కొన్ని అసంతృప్తుల కారణంగా ఈ జిల్లాల్లో అసెంబ్లీ మరియు పార్లమెంటరీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలాయి. మరోవైపు రాజస్థాన్ ప్రభుత్వం అన్నపూర్ణ రసోయి యోజన (శ్రీ అన్న)లో ముతక ధాన్యాలను విలీనం చేయడంతో పాటు అవసరమైన వారికి రూ.8 సబ్సిడీ రేటుతో భోజనాన్ని అందిస్తోంది.
© 2023 - 2024 Millets News. All rights reserved.