యూఎస్ కు మిల్లెట్స్ ఎగుమతి చేస్తున్న ఉక్రెయిన్..!!

యూఎస్ కు మిల్లెట్స్ ఎగుమతి చేస్తున్న ఉక్రెయిన్..!!

యూఎస్ కు మిల్లెట్స్ ఎగుమతి చేస్తున్న ఉక్రెయిన్..!!

 

మారుతున్న కాలంతో పాటు మనిషి ఆహార నియమాల్లోనూ కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉరుకుల పరుగుల జీవితంలో తిండి, నిద్ర వంటి పలు ముఖ్య విషయాల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో చిన్న వయసులోనే అనేక ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల పురాతన ధాన్యాలైన మిల్లెట్స్ పై అవగాహన కల్పిస్తూ.. పలు కార్యక్రమాలను ప్రభుత్వాలు చేపడుతున్నాయి. దీంతో యావత్ ప్రపంచ వ్యాప్తంగా చిరుధాన్యాల వాడకం క్రమక్రమంగా పెరుగుతుంది. మెరుగైన ఆరోగ్య ప్రయోజనాల కోసం మిల్లెట్స్ ను ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. 

ఇప్పటికే పలు దేశాల్లో మిల్లెట్స్ ను రైతులు సాగుతో పాటు ఎగుమతి కూడా చేస్తుండగా..కొన్ని ప్రాంతాల్లో మిల్లెట్స్ దిగుమతి జరుగుతోంది. తాజాగా యూనిటైడ్ స్టేట్స్ (యూఎస్) కు ఉక్రెయిన్ సేంద్రీయ మిల్లెట్లను ఎగుమతి చేస్తుంది. ఈ మేరకు చిరుధాన్యాల ఎగుమతి ప్రక్రియను ప్రారంభించిందని.. ఆర్గానిక్ స్టాండర్డ్ సర్టిఫికేషన్ కంపెనీ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నట్లు ఉక్రెయిన్ మీడియా తెలిపింది. ఈ మిల్లెట్ల ఉత్పత్తులు అన్నీ సీఓఆర్ ( కెనడియన్ ఆర్గానిక్ రెజిమ్ ) ప్రమాణానికి తగినట్లుగా ధృవీకరించబడ్డాయి. అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్ కు చిరుధాన్యాలను దిగుమతి చేసుకునే విధంగా అనుమతి పత్రం జారీ చేయబడుతుంది. ఇది కెనడియన్ మరియు యునైటెడ్ స్టేట్స్ ప్రమాణాలకు తగినట్లుగా మరియు వారి సేంద్రీయ అవసరాలను గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించింది.

సీఓఆర్ ( కెనడియన్ ఆర్గానిక్ రెజిమ్) స్టాండర్డ్ ఈక్వెలన్సీ సర్టిఫికేట్ సాయంతో యూఎస్, కెనడాకు ఒకేసారి మిల్లెట్స్ దిగుమతి జరుగుతుంది. ఆర్గానిక్ స్టాండర్డ్ సర్టిఫికేషన్ కంపెనీ అనేది సేంద్రీయ ఉత్పత్తిని పరిశీలించడంతో పాటు ధృవీకరించే మొదటి ఉక్రెయిన్ సంస్థ. ఉక్రెయిన్ స్విస్ ప్రాజెక్టులో భాగంగా ఈ సంస్థను 2007 సంవత్సరంలో స్థాపించారని సమాచారం. 

కాగా.. మిల్లెట్స్ పురాతన ముతక ధాన్యాలు అయినప్పటికీ వాటిలో అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో ఉండే ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ మరియు విటమిన్లు మన ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. ఇక భారత దేశంలోనూ మిల్లెట్లను పండించడంతో పాటు ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో చిరుధాన్యాల సాగు జరుగుతోంది. మన దేశంలో ముఖ్యమైన చిరుధాన్యాలుగా రాగులు, జొన్నలు, సజ్జలు, అరికెలు, కొర్రలు, అండు కొర్రలు, ఊదలు వంటివి ఉన్నాయి. ఇవి చిన్నారుల నుంచి పెద్దవారి వరకు మంచి ఆహార ఎంపికని పోషకాహార నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. 

 


© 2023 - 2024 Millets News. All rights reserved.