ఫింగర్ మిల్లెట్స్ (రాగులు)..
చిరుధాన్యాలలో ఒకటైన రాగులను ‘ఫింగర్ మిల్లెట్స్’ అని కూడా పిలుస్తుంటారు. రాగులను పురాతన చిరుధాన్యంగా చెప్పుకుంటారు. గత కొన్నేళ్లుగా ఆసియా మరియు ఆఫ్రికాలో
ఈ చిరుధాన్యాలను విరివిగా సాగు చేస్తున్నారు. అంతేకాదు భారతదేశంలోనూ రాగులు ప్రధానమైన ఆహారం. దక్షిణ భారతంలో రాగులను ప్రధాన పంటగా సాగు చేస్తుండగా.. ఇవి ఇతర ధాన్యాల కంటే బలవర్థకమైనవి.
ఫింగర్ మిల్లెట్ (రాగులు)లో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, కాల్షియం మరియు యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం వంటివి రాగుల్లో అధికంగా ఉంటాయి. అదేవిధంగా ఇందులో అయోడిన్, మినరల్స్ తో ఉండటంతో పాటు ఇవి లోఫ్యాట్ శాతాన్ని కలిగి ఉంటుంది. రొట్టెలు, గంజి మరియు సూప్ వంటి వంటకాలలో వీటిని వినియోగిస్తున్నారు.
రాగులతో ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు..
కాల్షియం పవర్ హౌస్ :
ఫింగర్ మిల్లెట్స్ లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇవి ఇతర ధాన్యాల కంటే 5 నుండి 30 రెట్లు ఎక్కువ కాల్షియం కలిగి ఉంటాయి. ఇది ఎదిగే పిల్లలతో పాటు వృద్ధుల్లో ఎముకల ధృడత్వానికి సహాయపడుతుంది. మహిళలు కూడా రాగులను తరచుగా తీసుకోవడం వలన ఎముకలు బలంగా తయారవుతాయి. ఇందుకోసం రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్ ను తాగడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ రాగి మాల్ట్ ఎముకల పటుత్వంతో పాటు ధాతువుల నిర్మాణానికి సహాయపడుతుంది. అలాగే బోలు ఎముకల వ్యాధి వంటి వ్యాధులను దూరం చేస్తాయి.
రాగులలో ఐరన్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది. వీటిని ఆహారంగా తీసుకోవడం వలన శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకోవచ్చు. అదేవిధంగా రక్తహీనతను నివారించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
అధిక ప్రోటీన్లు..
ఇతర చిరుధాన్యాలతో పోలిస్తే ఫింగర్ మిల్లెట్ లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. పోషకాహార నిపుణులు నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం, బియ్యంతో పోలిస్తే.. 100 గ్రాముల ఫింగర్ మిల్లెట్ ధాన్యానికి 7.2 గ్రా ప్రోటీన్లు కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఈ మిల్లెట్ కు చెందిన కొన్ని రకాలు 100 గ్రాముల్లో సుమారు 14.7 గ్రా. వరకు ప్రోటీన్ స్థాయిలను కలిగి ఉంటాయి.
మధుమేహగ్రస్తులకు...
మధుమేహంతో బాధపడుతున్న వారికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు దివ్య ఔషధంగా పని చేస్తాయి. రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం వంటివి తీసుకోవడం వలన మంచి ఫలితాలు కనబడతాయి. అలాగే ఇందులో ఉండే ఫైటోకెమికల్స్ వలన చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
రాగుల్లో అమైనోయాసిడ్ లెసిథిన్, మేథినోన్ ఉండటం వలన కాలేయంలోని అదనపు కొవ్వు తొలగిపోతుంది. తద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుముఖం పడతాయి. ఫింగర్ మిల్లెట్స్ లో అమైనో యాసిడ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని కణజాలం బాగు కోసం సహాయపడతాయి. హై బ్లడ్ ప్రెజర్ ను తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. రోస్ట్ చేసిన రాగులను తీసుకోవడం అధిక రక్తపోటు సమస్య ఉన్నవారికి టానిక్ తరహాలో ఉపయోగపడుతుంది.
ఫింగర్ మిల్లెట్స్ ను తగిన మోతాదులో ప్రతి రోజు తినడం వలన కాలేయ వ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు మరియు ఉబ్బసం, ఊబకాయం వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాగే వీటిని పోషకాహార నిపుణుల సూచనల మేరకు తీసుకోవడం వలన ఎటువంటి దుష్ప్రభావాలు కలగవు..కాగా అన్ని ప్రధానమైన తృణధాన్యాల్లోనూ ఫింగర్ మిల్లెట్స్ అత్యంత పోషకాలను కలిగి ఉన్నాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. యునైటెడ్ స్టేట్స్ నేషనల్ అకాడెమీస్ ‘ది లాస్ట్ క్రాప్స్ ఆఫ్ ఆఫ్రికా ’ అనే పేరుతో వెలువరించిన అధ్యయనంలో ఫింగర్ మిల్లెట్స్ ప్రాధాన్యతను వివరించారు.
© 2023 - 2024 Millets News. All rights reserved.