జీవనశైలిలో చోటు చేసుకుంటున్న మార్పుల నేపథ్యంలో మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. అతి చిన్న వయసులోనే బీపీ, మధుమేహం మరియు ఊబకాయం వంటి పలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాదు సరైన ఆహార నియమాలు పాటించకపోవడం వలన జీర్ణవ్యవస్థపై ఎక్కువ భారం పడుతుంది. దీంతో జీర్ణాశయ సమస్యలు మరియు పేగు పూత, గట్, కడుపు ఇన్ఫెక్షన్లకు గురవుతున్నారు.
జీర్ణసమస్యలతో బాధపడేవారికి మిల్లెట్స్ మంచి ఔషధంగా పని చేస్తుందని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు. సాధారణంగా గ్లూటెన్ జీర్ణ సంబంధిత సమస్యలకు కారణంగా మారుతుంది. ఈ క్రమంలో ఈ అనారోగ్యాన్ని తగ్గించుకోవడానికి గ్లూటెన్ ఫ్రీ ఆహారాన్ని తీసుకోవాలి. ఇందులో భాగంగా రాగులు, జొన్నలు, ఊదలు, అరికెలు వంటి చిరుధాన్యాలను తినడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
సామలను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన పేగు క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడొచ్చు. అలాగే కొర్రలను తినడం వలన బరువు త్వరగా తగ్గడంతో పాటు జీర్ణ సమస్యలు ఉండవు. అదేవిధంగా సజ్జలు, జొన్నలతో తయారుచేసిన ఆహారాన్ని తీసుకోవడం వలన జీర్ణ సమస్యల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది.
కొర్రలు, సామలు, సజ్జలు, ఊదలు, అరికెలు, వరిగలు వంటి చిరుధాన్యాలు ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ అందుబాటులోనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే వీటిపై అవగాహన పెరుగుతుండటంతో మిల్లెట్స్ ను వినియోగిస్తున్నారు. మన శరీరానికి కావాల్సిన పోషక పదార్థాలు మిల్లెట్స్ లో పుష్కలంగా ఉంటాయి. అలాగే ప్రోటీన్లు, ఫైబర్, కాల్షియం వంటి ఖనిజాలు, సూక్ష్మ పోషకాలు మెండుగా ఉంటాయి.
మిల్లెట్స్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి దోహదపడటంతో పాటు పేగు కదలికలను నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా వీటిలో ప్రీ బయోటిక్స్ కూడా ఉంటాయి. మైక్రోబయోమ్ లోని ప్రోబయోటిక్స్ పెరుగుదలను ఇది ప్రేరేపిస్తుంది. దాంతోపాటుగా ఇది గట్ ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది. వీటిని ఆహారంగా తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు, పేగు సంబంధిన సమస్యల నుండి బయట పడటంతో పాటు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
© 2023 - 2024 Millets News. All rights reserved.