అనారోగ్య సమస్యలకు అండు కొర్రలతో చెక్..!

అనారోగ్య సమస్యలకు అండు కొర్రలతో చెక్..!

అనారోగ్య సమస్యలకు అండు కొర్రలతో చెక్..!

 

చిరుధాన్యాలు (మిల్లెట్స్) ఆరోగ్యానికి ఎంతో మేలును చేకూరుస్తాయన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతమున్న ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని పట్టించుకునే తీరిక ఉండకపోవడంతో.. అటువంటి వారంతా చిరుధాన్యాల వైపే మొగ్గు చూపుతున్నారు. మిల్లెట్స్ పై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండటంతో వాటిని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు. ఈ చిరుధాన్యాల్లో ‘అండు కొర్రలు’ ఒకటి. ఇతర మిల్లెట్స్ తరహాలోనే మనలను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ అండు కొర్రలు తీపి మరియు వగరు రుచులను కలిగి ఉంటాయి. 

అండు కొర్రలను ఆహారంగా తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు అనేక రకాల వ్యాధులు, ఇన్ ఫెక్షన్లు రాకుండా మనం జాగ్రత్త పడొచ్చు. అదేవిధంగా అండుకొర్రలను తింటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్ధకం, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. దీని ద్వారా జీర్ణవ్యవస్థ సమస్యలు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల పెద్ద ప్రేగు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండొచ్చు. 

ఈ మిల్లెట్స్ కంటి సమస్యలు, ఊబకాయం వంటి సమస్యల నివారణకు ఎంతగానో ఉపయోగపడతాయి. అండు కొర్రలలో ఉండే విటమిన్ బీ1 మరియు బీ3 మన శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగించి.. బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఈ క్రమంలోనే అధిక బరువుతో బాధపడేవారికి అండుకొర్రలు దివ్య ఔషధమని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. అలాగే బీపీ, మధుమేహం వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అండుకొర్రలను తినడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. రక్తహీనత వంటి సమస్యలు తగ్గుతాయి.

అండు కొర్రలలో అనేక రకాల విటమిన్లు ఉంటాయి. ఇవి మన మెదడు పనితీరుని మెరుగు పరచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. మెదడు అభివృద్ధికి సహాయ పడటంతో పాటు యాక్టివ్ గా పని చేసేలా చేస్తాయి. వీటి వలన మెదడుకు ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరిగి.. జ్ఞాపకశక్తి,  ఏకాగ్రత పెరుగుతుంది. దాంతోపాటుగా ఈ మిల్లెట్స్ ను ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వలన నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యం బాగుపడుతుంది. ఇక అల్జీమర్స్ ఉన్న వారు కూడా అండు కొర్రలను తినడం వలన మంచి ఫలితాలు ఉంటాయని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే చిన్నారుల నుంచి పెద్దవారి వరకు మిల్లెట్స్ ను పోషకాహార నిపుణుల సూచనల మేరకు ఆహారంగా తీసుకోవాలి. కాగా ఎన్నో పోషకాలతో నిండి ఉన్న అండు కొర్రలతో ఊతప్పం, పొంగలి, ఉప్మా, కిచిడి వంటి ఆహార పదార్థాలను తయారు చేసుకోవచ్చు.

 


© 2023 - 2025 Millets News. All rights reserved.