భారతదేశంలో ప్రస్తుతం ప్రజల్లో పోషకాహారంతో పాటు మిల్లెట్స్ (చిరుధాన్యాలు) పై అవగాహన పెరుగుతోంది. దీంతో జొన్నలు (జోవర్), రాగులు, సామలు, కొర్రలు వంటి పురాతన ధాన్యాలకు డిమాండ్ కూడా క్రమంగా పెరుగుతోంది. అంతేకాదు ప్రతి ఒక్కరూ మిల్లెట్స్ ను రోజువారీ ఆహారంలో భాగంగా చేర్చుకుంటున్నారు. బియ్యం, గోధుమ మన ప్రధాన ఆహారాలుగా మారినప్పటికీ మిల్లెట్స్ పై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న నేపథ్యంలో మళ్లీ జొన్నల వినియోగం పెరిగింది. ఈ క్రమంలోనే జొన్నలతో తయారు చేసిన రొట్టెలే కాకుండా జావ, కేకులు వంటి అనేక రకాల ఆహార పదార్థాలను తింటున్నారు.
జొన్నలలో ప్రోటీన్లు, డైటరీ ఫైబర్ మరియు కార్బోహైడ్రేడ్లు పుష్కలంగా ఉంటాయి. ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియంతో పాటు జొన్నలలో నియాసిస్, థయామిన్, ఫోలేట్, రిబోఫ్లావిన్ వంటి విటమిన్లు మెండుగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలును చేకూరుస్తాయి. అయితే జొన్నలను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.
జోన్నల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.. ఇది మన శరీరానికి ప్రతి రోజు అవసరమయ్యే దానిలో సుమారు 48 శాతం జొన్నల ద్వారా లభిస్తుందని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు. ఇందులో ఉండే ఫైబర్ పేగుల కదలికలను ప్రోత్సహిస్తుందని.. దీని ద్వారా జీర్ణక్రియ సాఫీగా జరుగుతుందని వెల్లడించారు. జొన్నలను తరచుగా తినడం వలన గ్యాస్, మలబద్ధకం, ఉబ్బరం మరియు అతిసారం వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
జొన్నలపై ఉండే పొరలో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ తో పోరాడతాయి. అదేవిధంగా జొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వలన ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వీటిలో ఉండే పోషకాలు ఎముకలు, కణజలాలు బలంగా ఉంచుతాయి. అదేవిధంగా జొన్నల్లో ఉండే ఐరన్ ఎర్ర రక్త కణాల పెంపుకు దోహదం చేస్తుంది. దాంతో పాటుగా జొన్నలను తినడం వలన రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. ముఖ్యంగా జొన్నలను ఆహారంలో చేర్చుకోవడం వలన బరువును తగ్గవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఊబకాయం సమస్యతో బాధపడేవారికి జొన్నలు మంచి ఆహారమని చెప్పుకోవచ్చు.
జొన్నలు నెమ్మదిగా జీర్ణం అవుతాయి. దీని ద్వారా రక్తంలోకి గ్లూకోజ్ నెమ్మదిగా వెళ్తుంది. దీంతో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. అదేవిధంగా జొన్నల్లో గ్లూటెన్ ఉండదు. గ్లూటెన్ అసహనం ఉన్నవారికి ఇవి మంచి ప్రత్యామ్నాయం. జొన్నల్లో ఉండే ఫైబజొర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. దీని ద్వారా స్ట్రోక్ మరియు గుండె సంబంధిత సమస్యల ముప్పును తగ్గించుకోవచ్చు.
© 2023 - 2024 Millets News. All rights reserved.