ప్రపంచ వ్యాప్తంగా మిల్లెట్స్ ( చిరుధాన్యాలు) ప్రజాదరణ పొందుతున్నాయన్న సంగతి తెలిసిందే. వీటిపై ప్రతి ఒక్కరికీ అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో రోజురోజుకు మిల్లెట్స్ వాడకం కూడా పెరుగుతోంది. తాజాగా విదేశాల్లో మిల్లెట్ మిల్క్ ట్రెండ్ సృష్టిస్తున్నాయన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతేకాదు వీటిని అందరూ ఎంతో సులువుగా ఇంటిలోనే తయారు చేసుకోవచ్చు.
పురాతన ధాన్యాలైనప్పటికీ వీటిని ఆహారంగా తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎంతో మంచిది. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, అరికలు, సామలు ... ఇటువంటి ధాన్యాలనే మిల్లెట్స్ గా పిలుచుకుంటారు. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ క్రమంలో ఆరోగ్యాన్ని అందించే ‘మిల్లెట్ మిల్క్’ తయారీ విధానాన్ని మనం కూడా తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
మిల్లెట్స్ : ఒక కప్పు
నీరు : ఆరు కప్పులు
తేనె : మూడు టేబుల్ స్పూన్లు
తయారీ విధానం:
ముందుగా మనకు నచ్చిన మిల్లెట్స్ ను ఎంచుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో ఒక కప్పు ఎంచుకున్న మిల్లెట్స్ తో పాటు ఉడకడానికి సరిపడా నీళ్లు పోయాలి. తక్కువ వేడి మీద ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. చల్లారిన తరువాత ఉడికిన మిల్లెట్లను పక్కకు పెట్టుకోవాలి. ఒక కప్పు మిల్లెట్స్ కు రెండు కప్పుల నీటిని వేసి జ్యూస్ లా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఆ జ్యూస్ ను వడకట్టి గ్లాసులోకి తీసుకుని కాస్త తేనె కలుపుకోవాలి. అంతే ఎంతో టెస్టీ అయినా మిల్లెట్ మిల్క్ రెడీ. అంతేకాదు ఈ పాలను ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే దాదాపు పది రోజుల వరకు నిల్వ ఉంటాయి.
రక్తహీనత సమస్యతో బాధపడేవారికి మిల్లెట్ మిల్క్ దివ్య ఔషధంగా పని చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. శరీరంలో శక్తి తక్కువగా ఉన్నవారు ప్రతి రోజూ మిల్లెట్ మిల్క్ ను తాగడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు. అంతేకాదు చిన్నారులకు కూడా ప్రతి రోజు ఒక గ్లాసు మిల్లెట్ మిల్క్ తాగించడం మంచిదని సూచిస్తున్నారు.
© 2023 - 2024 Millets News. All rights reserved.