విభిన్న వాతావరణ పరిస్థితులకు అనుకూలం
తక్కువ నీటి సరఫరాలోనూ సాగు
తెగుళ్ల బెడద తక్కువ
ఎలాంటి నేలలోనైనా పెరుగుదల
అనేక ఆరోగ్య ప్రయోజనాలు
చిరుధాన్యాలు ( మిల్లెట్స్) ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్నాయి. పురాతన ధాన్యాలు అయినప్పటికీ మిల్లెట్స్ లో పోషక పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అంతేకాదు మిల్లెట్స్ రైతులకు అనుకూలమైన పంటలని చెప్పుకోవచ్చు. అందుకే చిరుధాన్యాల పంటలు ప్రకృతి మనకు అందించిన వరాలనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. వీటి సాగు సులభం మరియు మిల్లెట్స్ వలన కలిగే ప్రయోజనాలు అపారమని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు.
మన దేశంలో చిరుధాన్యాలైన జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, వరిగెలు, అండు కొర్రలు, ఊదలు వంటి రకాలను రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మిల్లెట్స్ సాగును ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా రైతులకు సాగు కోసం కావాల్సిన యంత్ర పరికరాలు, విత్తనాలు మరియు ఎరువులను సైతం అందిస్తోందన్న సంగతి తెలిసిందే. వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకున్నప్పటికీ మిల్లెట్స్ ను సులభంగా సాగు చేయవచ్చు.
నీటి పారుదల సౌకర్యం తక్కువగా ఉన్నప్పటికీ చిరుధాన్యాల పంటలను పండించవచ్చు. అందుకే దేశంలోని నీటి పారుదల తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీటి సాగు ఎక్కువగా జరుగుతోంది. అదేవిధంగా సగటు మరియు తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లోనూ వీటిని సాగు చేస్తుంటారు.
అన్ని రకాల మిల్లెట్స్ లోనూ శరీరానికి అవసరమైన పోషక పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి.వీటిలో ఉండే ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్లు మరియు మినరల్స్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. దీని కారణంగానే దేశంలో వీటి సాగు ఆవశ్యకత కూడా రోజురోజుకూ పెరుగుతోంది. తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడిని సాధించే అవకాశం మరియు తెగుళ్ల బెడద కూడా తక్కువ. అంతేకాదు ప్రస్తుతం చిరుధాన్యాల వినియోగం ఎక్కువగా ఉండటంతో మార్కెట్ లో మంచి గిరాకీ ఏర్పడింది. దీని వలన మిల్లెట్స్ ను సాగు చేస్తున్న రైతులకు లాభాల పంట పండిస్తోందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఎటువంటి నేలలోనైనా మిల్లెట్స్ పంటలను సాగు చేయవచ్చు.
© 2023 - 2025 Millets News. All rights reserved.