ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ సమయపాలన లేని ఆహార నియమాలను పాటిస్తున్నారు. ఫలితంగా చిన్న వయసులోనే బీపీ, మధుమేహం మరియు ఊబకాయం వంటి పలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఈ సమస్యల నుంచి బయటపడటానికి అత్యుత్తమమైన మార్గం చిరుధాన్యాలు (మిల్లెట్స్) ను రోజూవారీ ఆహారంలో భాగంగా చేసుకోవడమేనని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
అతి తక్కువ ఖర్చుతో సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే చిరుధాన్యాలపై ఇప్పటికే ప్రభుత్వాలు విస్తృత ప్రచారాలు నిర్వహిస్తూ.. అవగాహన కల్పిస్తున్నాయి. పురాతన ధాన్యాలైన కొర్రలు, సామలు, జొన్నలు, అరికలు, వరిగలు, సజ్జలు మరియు ఊదలు, అండు కొర్రలను ఆహారంలో భాగంగా చేసుకోవాలని చెబుతున్నాయి. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణులు మరియు బాలింతల సంపూర్ణ ఆరోగ్యంలో మిల్లెట్స్ పాత్రను గుర్తించడమే కాకుండా... ఈ పంటల సాగు కోసం ప్రాచుర్యాన్ని కల్పిస్తున్నాయి. ఇందులో భాగంగానే అధిక విస్తీర్ణంలో చిరుధాన్యాల సాగును నిర్వహించి.. ఉత్పత్తి పెంచేదిశగా చర్యలు తీసుకుంటుంది.
తక్కువ ఖర్చుతో మిల్లెట్స్ సాగు..
చిరుధాన్యాల సాగు ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. భిన్నమైన వాతావరణ పరిస్థితులతో పాటు నీటి సరఫరా తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ వీటిని సాగు చేయడం సులభం. అంతేకాదు ఇవి తక్కువ కాలంలో పండే పంటలు. ఇందుకోసమే ప్రభుత్వాలు మిల్లెట్స్ సాగును ప్రోత్సహిస్తున్నాయి. ప్రకృతి సిద్ధంగా పండే ఈ పంటలలో రసాయనాల వాడకం కూడా ఉండదు. అందువలన మిల్లెట్స్ తో మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు.
పుష్కలంగా పోషకాలు...
మిల్లెల్స్ లో పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిలో ప్రోటీన్లు, మాంసకృతులు, విటమిన్లతో పాటు ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, పొటాషియం, ఐరన్ మరియు మెగ్నీషియంను కలిగి ఉండటంతో పాటు గ్లూటెన్ లేకుండా ఉంటాయి. అందుకే చిరుధాన్యాలను ‘‘ సూపర్ ఫుడ్ ’’ అని పిలుస్తారు. మారుతున్న జీవనశైలి, రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యం వంటి పరిస్థితుల్లో అనారోగ్యం బారిన పడకుండా చిరుధాన్యాలు వరప్రదాయినిగా పని చేస్తాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
అన్ని రకాల పోషకాలు కలిగి ఉండటంతో మిల్లెట్స్ ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి. మిల్లెట్స్ ను ఉపయోగించి రకరకాల ఆహార పదార్థాలను తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకు రొట్టెలు, అన్నం, దోశ, ఇడ్లీ.. అయితే వీటిని కడిగి నానబెట్టిన తరువాతే తీసుకోవాలని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు.
చిరుధాన్యాలు రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యానికి మేలును కలిగిస్తాయి. చిన్నారుల్లో ఎముకలను ధృడం చేసేందుకు, మలబద్ధకాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కొర్రలు, సజ్జలలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ సమస్యలు రాకుండా చూస్తుంది. అంతేకాదు వీటిలో ఐరన్ ఎక్కువగా ఉండటం వలన రక్తహీనతను తగ్గించి హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. మిల్లెట్స్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వలన అమినో యాసిడ్ నేచురల్ యాంటీ డిప్రెసింట్ గా పని చేస్తాయి. దీంతో నిద్రలేమి, డిప్రెషన్ మరియు ఆందోళన వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అదేవిధంగా మిల్లెట్స్ మన శరీరంలోని కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. వీటిలో ఉండే కాటెచిన్స్, ఫెరులిక్ యాసిడ్ వంటి ఫైటోన్యూట్రియెంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ గా పని చేస్తాయి. దాంతోపాటుగా చిరుధాన్యాలలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ నాడీ వ్యవస్థతో పాటు జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
© 2023 - 2025 Millets News. All rights reserved.