చిన్నారులకు చిరుధాన్యాలు
* పిల్లల వృద్ధికి మిల్లెట్స్
* పోషకాహార లోపానికి చెక్
* చిన్నారుల శారీరక వృద్ధి 26 నుంచి 39 శాతం ఎక్కువ
మిల్లెట్స్.. ప్రస్తుతం దేశంలో వీటి గురించి తెలియని వారు లేరని చెప్పుకోవచ్చు. చిరుధాన్యాలపై అవగాహన కల్పిస్తున్న నేపథ్యంలో మిల్లెట్స్ ప్రజాధారణ పొందుతున్నాయి. ఎన్నో వ్యాధులకు ‘సిరి ధాన్యాలు (మిల్లెట్స్)’ దివ్య ఔషధాలుగా పని చేస్తున్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిలో ప్రోటీన్, కాల్షియం, ఫైబర్ మరియు మినరల్స్, విటమిన్లు అధిక మోతాదులో ఉంటాయి.
చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మన దేశంలో ప్రధానంగా రాగులు, జొన్నలు, సజ్జలు వంటి ఏడు రకాల మిల్లెట్స్ లభిస్తున్నాయి. ఇవి చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తున్నాయి. అంతేకాదు చిన్నారుల ఎదుగుదలకు మిల్లెట్స్ చాలా బాగా పని చేస్తాయని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు.. ఎదిగే పిల్లలకు చిరుధాన్యాలను అందించడం వలన పోషకాహార లోపాన్ని తొలగించవచ్చని చెబుతున్నారు. అదేవిధంగా పిల్లల శారీరక ఎదుగుదల కూడా వేగంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. చిరుధాన్యాల ఆహారం తీసుకునే చిన్నారుల శారీరక వృద్ధి 26 నుంచి 39 శాతం ఎక్కువ ఉందని అధ్యయనాల్లో వెల్లడైందని చెబుతున్నారు.
ఇటీవల కాలంలో చాలా మంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పిల్లలకు బియ్యంతో వండిన అన్నాన్ని తగ్గించి మిల్లెట్స్ తో తయారు చేసిన ఆహారాన్ని అందించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధంగా చేయడం వలన చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించవచ్చు. మిల్లెట్స్ ను ఆహారంగా తీసుకోవడం వలన రక్తంలో గ్లూకోస్ శాతం తగ్గుముఖం పట్టడంతో మధుమేహా వ్యాధి నియంత్రణలో ఉంటుంది.
చిరు ధాన్యాల్లో కాల్షియంతో పాటు పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. కాల్షియం వలన దంతాలు, ఎముకలు ధృడంగా ఉంటాయి. ఇక వీటిలో ఉండే పీచు వలన కిడ్నీ, పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటం వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే మిల్లెట్స్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా అసిడిటీ సమస్యతో బాధపడే వారికి మిల్లెట్స్ మంచి ఔషధంగా పని చేస్తాయి.
కొర్రలు, సామలు, అరికలు, రాగులు, జొన్నలు, ఊదలు వంటి సిరి ధాన్యాలు ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంటున్నాయి. వీటిలో ఎలర్జీ కలిగించే గుణం ఉండదని.. అందువలన చిన్నారులకు కూడా వీటి ఆహారాన్ని అందించవచ్చని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు. పిల్లలకు రాగులు చాలా ఉపయోగకరమని చెబుతున్నారు. అదేవిధంగా సామలు, సజ్జలు, రాగులను కలిపి వారికి ఆహారంగా ఇవ్వడం మంచిదని సూచిస్తున్నారు. ముఖ్యంగా రాగుల్లో ఉండే ప్రోటీన్, సల్ఫర్ తో కూడిన అమైనో ఆమ్లాలు పిల్లల ఎదుగుదలకు పని చేస్తాయని గుర్తించారు.
చిన్నారులే కాకుండా పెద్దవారికి సైతం మిల్లెట్స్ వలన మంచి ఆరోగ్యం చేకూరుతుంది. క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులతో పాటు ఊబకాయం వంటి వ్యాధులు ఉన్నవారు మిల్లెట్స్ ను రోజు తింటే మంచిది. అయితే పోషకాహార నిపుణుల సూచనల మేరకు తగిన మోతాదులో వీటిని ఆహారంగా తీసుకోవడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి.
© 2023 - 2024 Millets News. All rights reserved.