ఒడిశాలో వివిధ పంటల వార్షిక దిగుబడి జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది. ఈ క్రమంలోనే వరి దిగుబడి సుమారు 19 శాతం తక్కువగా ఉందని తెలుస్తోంది. అదేవిధంగా జాతీయ సగటుతో పోలిస్తే.. పప్పుధాన్యాల విషయంలో 61 శాతం దిగుబడి ఉంది. ఈ విషయాన్ని ఒడిశా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే (2022- 23) నివేదిక తెలిపింది.
సాధారణంగా రైతుల ఆదాయాన్ని పెంచడానికి దిగుబడిని పెంచడంతో పాటు సామర్థ్యాన్ని మెరుగుపరచడం అవసరమని ఆర్థిక సర్వే నివేదిక పేర్కొంది. భారత ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రం 2017-18 నుండి ఒడిశా మిల్లెట్ మిషన్ కింద మిల్లెట్ సాగు మరియు వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలోనే 2022-23 ఏడాదిలో ఒడిశాలో మిల్లెట్ ఉత్పత్తి 47.3 శాతం పెరిగింది. కాగా ఒడిశా మిల్లెట్ మిషన్ అమలు నుండి 2017-18 మరియు 2022-23 మధ్య రాష్ట్రంలో మిల్లెట్ ఉత్పత్తి దాదాపు 121 శాతం పెరిగిందని తెలిపింది.
అయితే.. పురాతన ధాన్యాలైన మిల్లెట్స్ పై అవగాహన పెరుగుతుండటంతో వాటి వాడకం విరివిగా పెరిగింది. దాంతోపాటుగా ప్రభుత్వం కల్పిస్తున్న అవగాహన మరియు అందిస్తున్న ప్రోత్సాహాంతో రాష్ట్రంలోని రైతులు మిల్లెట్స్ సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. విభిన్నమైన వాతావరణ పరిస్థితులు, తక్కువ నీటి పారుదల సౌకర్యం ఉన్న ప్రాంతాల్లోనూ సులభంగా ఈ ధాన్యాలను పండివచ్చు. దీంతో ఒడిశాలో మిల్లెట్స్ ను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారని తెలుస్తోంది. కాగా చిరుధాన్యాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు మరియు ఖనిజాలు మెండుగా ఉంటాయి. అందుకే మిల్లెట్స్ ను ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
2021-22 లో 113.8 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 24.2 శాతం వృద్ధి చెందడం ద్వారా 2022-23 లో ఒడిశాలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 141.4 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంది. అయితే.. 2021-22 నాటికి భారతదేశంలోని మొత్తం వరి ఉత్పత్తిలో ఏడు శాతం వాటాతో రాష్ట్రం దేశంలో ఐదవ స్థానంలో ఉంది. అదేవిధంగా 2011-12 సంవత్సరంలో రూ.8,520 కోట్లు ఉన్న వ్యవసాయ రుణ పంపిణీ 2022-23 లో రూ.54,717 కోట్లకు పెరిగింది.
ఒడిశాలో నీటి పారుదల సామర్థ్యం (ఐపీసీ) 2013-14 నుండి 2022-23 మధ్య కాలంలో సుమారు యాభై లక్షల హెక్టార్ల నుండి 69.2 లక్షల హెక్టార్లకు చేరుకుంది. అలాగే రాష్ట్రం పశు సంపద మరియు మత్స్య ఉత్పత్తిలోనూ వృద్ధిని సాధించింది. ఇది ఆహార భద్రతతో పాటు ఆర్థిక అభివృద్ధికి దోహదపడింది. దాంతోపాటుగా ఒడిశాలో పాల ఉత్పత్తి 2021-22 లో 24.0 ఎల్ఎంటీ నుండి 2022-23 లో 24.8 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. కానీ రాష్ట్రంలో తలసరి పాలు, గుడ్ల లభ్యత మాత్రం జాతీయ సగటు కంటే తక్కువగా ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దిగుబడిని పెంచడం, పాల వ్యవస్థను ప్రోత్సహించడం ద్వారా పాల ఉత్పత్తిని పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గుడ్ల లభ్యతను పెంచడానికి వాణిజ్య పౌల్ట్రీ రంగంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని వెల్లడైంది.
© 2023 - 2024 Millets News. All rights reserved.