చిరుధాన్యాలు (మిల్లెట్స్) వలన సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చన్న సంగతి దాదాపు ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం చిరుధాన్యాలపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమ రోజూవారీ ఆహారంలో మిల్లెట్లను భాగంగా చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం భారత్ - ఆఫ్రికా మధ్య చిరుధాన్యాల సంబంధాలను దక్షిణాఫ్రికా ప్రతినిధి బృందం ప్రోత్సహించనుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ యూనివర్సిటీని డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ - నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ( డీఎస్ఐ - ఎన్ఆర్ఎఫ్), సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇండిజినస్ నాలెడ్జ్ సిస్టమ్స్ ( సీఐకేఎస్), యూనివర్సిటీ ఆఫ్ క్వాజులు - నటాల్, డర్బన్, దక్షిణాఫ్రికా ప్రతినిధి బృందం జూలై 21వ తేదీన సందర్శించింది.
విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు ప్రభుత్వ సమన్వయంతో డర్బన్ లోని భారత కాన్సులేట్ జనరల్ ఈ పర్యటనను ఏర్పాటు చేశారు. దక్షిణాఫ్రికా ప్రతినిధుల బృందం పర్యటనకు నోడల్ అధికారిగా స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ లోని ప్లాంట్ సైన్సెస్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. ముత్తమిలరసన్ వ్యవహరించారు. అదేవిధంగా... మొత్తం ఐదుగురు సభ్యుల ప్రతినిధి బృందంలో ప్రొఫెసర్ వివియన్ ఓజాంగ్ (డీన్ ఆఫ్ రీసెర్చ్, కాలేజ్ ఆఫ్ హ్యుమానిటీస్, యూనివర్సిటీ ఆఫ్ క్వాజులు -నటాల్) ప్రొఫెసర్ హసన్ కయా ( డైరెక్టర్, డీఎస్ఐ- ఎన్ఆర్ఎఫ్, సీఐకేఎస్.., ఆఫ్రికన్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండిజేనస్ నాలెడ్జ్ సిస్టమ్స్, యూనివర్సిటీ ఆఫ్ క్వాజులు -నటాల్ కోఆర్డినేటర్) ప్రొఫెసర్ యోనా సెలెటి ( మాజీ చీఫ్ డైరెక్టర్ : సైన్స్ మిషన్స్, దక్షిణాఫ్రికా నేషనల్ డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్, మరియు రీసెర్చ్ ఎక్స్పర్ట్, నెల్సన్ మండేలా యూనివర్సిటీ, దక్షిణాఫ్రికా) డాక్టర్ మాయశ్రీ చిన్సామి ( రీసెర్చ్ మేనేజర్, డీఎస్ఐ - ఎన్ఆర్ఎఫ్, సీఐకేఎస్., అండ్ సెక్రటేరియట్, ఆఫ్రికన్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండిజేనస్ నాలెడ్జ్ సిస్టమ్స్, యూనివర్సిటీ ఆఫ్ క్వాజులు - నటాల్) మరియు తేజ్ మోతిబే ఉన్నారు.
ప్రతినిధుల బృందానికి స్వాగతం పలికిన వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బీజే రావు .. మిల్లెట్స్ కు సంబంధించిన చరిత్రపై పని చేస్తున్న ఏకైక కేంద్రీయ విశ్వవిద్యాలయంగా హైదరాబాద్ యూనివర్సిటీకి ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. అదేవిధంగా మిల్లెట్స్ పై జ్ఞానాన్ని పెంచుకోవడంతో పాటు వాటిని అభివృద్ధి చేయడానికి సరైన విధానాలను గుర్తించడం గురించి ఆయన మాట్లాడారు. చిరుధాన్యాల పరిశోధనకు అంకితమైన సహకార పరిశోధనా కేంద్రాలను స్థాపించడం మరియు కొత్త ఆవిష్కరణలకు మద్ధతుగా నిధులను పొందడం వంటి పలు అంశాలను ప్రొఫెసర్ రావు వివరించారు. తరువాత హైదరాబాద్ విశ్వవిద్యాలయం మరియు క్వాజులు - నాటల్ విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం ప్రాముఖ్యతను వెల్లడించారు. దీనికి ప్రధాన కారణం రెండు దేశాలలో మిల్లెట్స్ పై పరిశోధనలను ప్రోత్సహించడానికి ఈ ఒప్పందం కీలకంగా పని చేస్తుంది. చిరుధాన్యాల సాగు కోసం వనరులను పంచుకోవడంతో పాటు మిల్లెట్స్ కు మద్ధతు ఇస్తుంది. అలాగే భారత్ మరియు దక్షిణాఫ్రికా విద్యార్థులతో పాటు రెండు దేశాల మధ్య విద్య, పరిశోధనా రంగాలలో కీలకంగా మారనుందని తెలుస్తోంది.
చిరుధాన్యాలను సాగు చేసే రైతుల ఆర్థిక వృద్ధితో పాటు సామాజిక అభ్యున్నతికి సహాయపడే విధంగా రెండు విశ్వవిద్యాలయాల మధ్య సహకారం ఉండాలని ప్రొఫెసర్ కయా అన్నారు. దీనితో ప్రొఫెసర్ ఓజోంగ్ ఏకీభవించారు. ఈ క్రమంలో థీమాటిక్ ట్రైనింగ్ తో పాటు హైదరాబాద్ యూనివర్సిటీ సంయుక్తంగా మద్ధతు ఇచ్చే జెనరిక్ డాక్టోరల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ మరియు మిల్లెట్ల ద్వారా ఇరు దేశాలకు చెందిన విద్యార్థులను చేర్చుకునే అవకాశంపై ప్రధానంగా చర్చించారు. అంతర్జాతీయ సామాజిక మరియు జ్ఞానపరమైన న్యాయం కోసం ప్రపంచ విజ్ఞాన ఆర్థిక వ్యవస్థలో దేశీయ విజ్ఞానం, సాంకేతికత, నూతన ఆవిష్కరణలు, వ్యాపార ఆలోచనలను క్రమబద్ధీకరించడానికి సీఐకేఎస్ ఆదేశాలను కూడా వివరించారు.
రిపోజిటరీ ఆఫ్ టొమాటో జెనోమిక్స్ రిసోర్సెస్ ( ఆర్టీజీఆర్) లో పర్యటించిన ప్రతినిధుల బృందం చిరుధాన్యాలపై... ముఖ్యంగా కొర్రలు ( ఫాక్స్ టైల్ మిల్లెట్స్), అరికలు ( కోడో మిల్లెట్స్) పై కొనసాగుతున్న పరిశోధనల పురోగతిని డా.ముత్తమిలరసన్ తెలిపారు. శీతోష్ణస్థితికి అనుకూలంగా.. స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా మిల్లెట్ల ఉత్పత్తిని మరింతగా పెంచవచ్చని ప్రతినిధులు బృందం భావిస్తోంది. అదేవిధంగా ఆఫ్రికా, భారతదేశం మిల్లెట్ పై శాస్త్రీయ పరిశోధన ప్రభావాన్ని పెంచుతాయని తెలుస్తోంది. మొత్తంగా చిరుధాన్యాల సాగును మెరుగుపరడంతో పాటు రైతులకు జీవనోపాధి పెరగనుంది. దాంతో పాటుగా ఆర్థిక అభివృద్ధికి, స్థితిస్థాపకతకు సహాయ పడే విధంగా బలమైన భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో ఈ పరిశోధనలు కీలక పాత్ర పోషించనున్నాయి.
© 2023 - 2024 Millets News. All rights reserved.