చిరుధాన్యాల పంటలకు సంరక్షకులుగా ఆదిమ తెగల బైగాస్..!!

చిరుధాన్యాల పంటలకు సంరక్షకులుగా ఆదిమ తెగల బైగాస్..!!

చిరుధాన్యాల పంటలకు సంరక్షకులుగా ఆదిమ తెగల బైగాస్..!!

 

వాతావరణ పరిస్థితుల్లో చోటు చేసుకుంటున్న మార్పుల దృష్ట్యా యావత్ ప్రపంచ వ్యాప్తంగా ‘‘ చిరుధాన్యాలు (మిల్లెట్స్)’’ ను భవిష్యత్ ఆహార ధాన్యాలుగా పేర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మిల్లెట్ పంటల సంరక్షణకు మన భారతదేశంలోని ఆదిమ తెగకు చెందిన బైగాస్ వ్యవసాయ పద్ధతులు ఎంతగానో దోహదపడతాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజలు వైవిధ్యభరితమైన వ్యవసాయ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇందులో భాగంగా ఒకేసారి వారి సాగు భూముల్లో కనీసం నాలుగు డజన్ల మిల్లెట్ పంటలు మరియు పప్పుధాన్యాలను పండిస్తారు. అదేవిధంగా ప్రత్యేకమైన వ్యవసాయ సంప్రదాయానికి బైగా రైతులు ప్రసిద్ధి చెందారు. పురాతన కాలం నుంచి ఈ పద్ధతులను ఆచరిస్తుండగా.. ఇది మన దేశంలోనే విభిన్నమైన వ్యవసాయ విధానమని చెప్పుకోవచ్చు. 

బైగా రైతులు తరచుగా వ్యవసాయ భూముల్లో ఒకేసారి 52 రకాల చిరుధాన్యాల పంటలను సాగు చేస్తుండటం ఎక్కువగా కనిపిస్తుందని మధ్య భారదేశంలోని గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా బైగాలలో పని చేస్తున్న ప్రముఖ ఎథ్నాలజిస్ట్ ఓ సందర్భంగా తెలియజేశారు. మధ్యప్రదేశ్ లోని మండ్లా, దిండోరి మరియు బాలాఘాట్ జిల్లాల్లో దాదాపు అన్ని రకాల చిరుధాన్యాల పంటలను పండిస్తున్నారని ఆయన వెల్లడించారని సమాచారం. ఈ క్రమంలోనే ముతక ధాన్యాలైన మిల్లెట్స్ వారి సంస్కృతిలో ఓ భాగమని చెప్పుకోవచ్చు. అంతేకాదు వారి వివాహ ఆచారాలు, పండుగలలో మిల్లెట్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇతర ప్రాంతాల్లో ప్రజలకు బియ్యం, గోధుమలు తరహాలో బైగా యొక్క ప్రధానమైన ఆహారం అరికెలు (కోడో మిల్లెట్) మరియు సామలు ( కుట్కి మిల్లెట్). 

సాధారణంగా వేర్వేరు చిరుధాన్యాల పంటలు వేర్వేరు సమయాల్లో చేతికి అందుతాయి. అందువలన ప్రతి మిల్లెట్ పంటకు దాని సొంత పంట కోత సమయం ఉంటుంది. బైగా రైతులకు విత్తనాల కాలం జూన్ లేదా జూలై నెలలో ప్రారంభమై పంట సెప్టెంబర్ నాటికి కోతకు వస్తుంది. బైగా ప్రజల వారసత్వ వ్యవసాయ పద్ధతిలో ముఖ్యమైన భాగం విత్తనాల సీజన్ లో చిరుధాన్యాల విత్తనాలను పంచుకోవడం. ఈ విధానమే అనేక చిరుధాన్యాల పంటల సంరక్షణకు దోహదపడింది. అంతేకాదు ఈ చిరుధాన్యాల విత్తనాలను సంరక్షించే బాధ్యతను సైతం బైగా మహిళలు తీసుకుంటారు. ఇందులో భాగంగా తమ ఇళ్లల్లో విత్తన బ్యాంకులను ఏర్పాటు చేసుకోవడం విశేషం.

 


© 2023 - 2024 Millets News. All rights reserved.