చిరుధాన్యాల సాగు మరియు వాడకంపై ప్రజల్లో రోజురోజుకు అవగాహన పెరుగుతోంది. దీంతో మిల్లెట్లతో తయారు చేసిన ఆహారాన్ని తీసుకుంటూ అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందుతున్నారు. దాంతోపాటుగా చిరుధాన్యాల సాగుపై రైతులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రభుత్వాల ద్వారా అందుతున్న ప్రోత్సాహాంతో ఈ ధాన్యాలను విరివిగా సాగు చేస్తున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే.
ముంబైకి చెందిన ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ అండ్ రీసెర్చ్ (ఎస్పీజేఐఎంఆర్), ఎం3ఎం ఫౌండేషన్ తో కలిసి పహాడ్ ట్రస్ట్ చంబాలోని చమిను గ్రామంలో రైతులు పాటించే సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులపై వర్క్ షాప్ నిర్వహించింది. దేశీయ విత్తనాలు మరియు మిల్లెట్లపై అవగాహన కల్పించేందుకు ఈ వర్క్ షాప్ చేపట్టగా ఇందులో సుమారు పది గ్రామాలకు చెందిన 35 మంది రైతులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న పద్మశ్రీ అవార్డు గ్రహీత నెక్ రామ్ శర్మ వాతావరణ మార్పులు, రసాయన ఎరువులు మరియు ప్రకృతి వంటి పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. మిల్లెట్ సాగు పద్ధతులు, విత్తన సంరక్షణ మరియు గుర్తింపుపై సమాచారాన్ని అందించారు.
సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు, దేశీయ విత్తనాలను వినియోగించి చిరుధాన్యాలను పండించాలని ప్రొఫెసర్ చంద్రికా పర్మార్ తెలిపారు. అయితే స్థిరమైన వ్యవసాయం రైతుల జీవనోపాధిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కొందరు రైతులు రసాయన ఎరువులను ఎక్కువగా వాడటం వలన నేల సంతానోత్పత్తి తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ కారణంగా చిరుధాన్యాలు, పప్పు ధాన్యాల సాగు నిర్మూలించే పరిస్థితి వస్తుందని తెలిపారు.
అయితే.. సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు, దేశీయ విత్తనాలను ఉపయోగించడంతో పోషక ధాన్యాలను సాగు చేయడం సులభతరం అవుతుంది. దీని వలన వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావాలను సైతం తగ్గించే అవకాశం ఉంటుందని రైతులకు సూచించారు. ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా తక్కువ నీటి సరఫరా, తక్కువ ఖర్చుతో చిరుధాన్యాలను సులభంగా సాగు చేయవచ్చు.. ఈ సందర్భంగా వర్క్ షాప్ లో పాల్గొన్న రైతులందరూ కలిసి ‘‘ మా చిరుధాన్యాలు’’ కు మద్ధతు ఇస్తామని ప్రమాణం చేశారు.
చంబా జిల్లాలోని రైతులు ఇప్పటికీ మిశ్రమ పంట పద్ధతిని పాటిస్తున్నారు. దీన్ని తొమ్మిది పంటలు ( నౌ-అనాజ్) అని పిలుస్తారు. ఈ పద్ధతి ప్రకారం ఒకే పొలంలో తొమ్మిది పంటను సాగు చేస్తారు. అవి పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు, కూరగాయాలు, చిక్కుళ్లు మరియు తీగలు. కాగా ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సుమారు 935 హెక్టార్లలో మిశ్రమ పంటల సాగు జరుగుతోంది. అదేవిధంగా చంబాలోని ఎత్తైన కొండ ప్రాంతాల్లో చిరుధాన్యాలను పరిమిత స్థాయిలో పండిస్తారు.
© 2023 - 2024 Millets News. All rights reserved.